వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి హంసవాహనోత్సవసేవ నేత్రపర్వం చేసింది. రంగురంగుల పూలకూర్పుతో కూడిన గజమాలికల మధ్య వటపత్రంపై విశేషాలంకృతులైన లక్ష్మీసమేత నృసింహస్వామివారు ‘వటపత్రశాయి’గా హంసవాహనం అధిష్టించారు. భక్తుల హర్షధ్వానాలు, భాజభజంత్రీలు, మేళతాళాలు, కోలాటాల మధ్య పురవీథులలో ఊరేగుతూ సభామండపం చేరుకున్నారు. అక్కడ వేదపఠనం, సంగీతం, భజనాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి, ధర్మకర్తలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కమనీయంగా సాగిన శ్రీవారి హంసవాహోత్సవ వైభవం తిలకించి భక్తజనులు తరించారు.


