పరిష్కారమా.. అవరోధమా!
నిర్వాసితుల నెత్తిన విలీనం పిడుగు
మున్సిపల్ ఎన్నికల వేళ.. మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీవాసులకు మరో టెన్షన్ మొదలైంది. ఈ కాలనీలోని 14 వేలకు పైచిలుకు ఓటర్లను గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 7, 8, 9, 10, 11, 12 వార్డుల్లో చేరుస్తూ ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. వీటిపై నామమాత్రంగా అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈనెల 12వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి కానుండగా.. ఈ పరిణామం పెండింగ్ సమస్యల పరిష్కారానికి అవరోధంగా మారుతుందా..? అనే ఆందోళన నిర్వాసితులను వెంటాడుతోంది.
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీని నిర్మించిన సంగతి తెలిసిందే. ముంపు గ్రామాలైన ఏటిగడ్డకిష్టాపూర్‌లో 1253, లక్ష్మాపూర్‌లో 388, వేములఘాట్‌లో 1252, పల్లెపహాడ్‌లో 921, రాంపూర్‌లో 320, బ్రహ్మణ బంజేరుపల్లిలో 267, ఎర్రవల్లిలో 800, సింగారంలో మరో 330కుపైగా కుటుంబాలు ఉన్నాయి. ముంపు బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.7.5లక్షలు, ఇల్లు. ఇల్లు వద్దంటే వారికి ఓపెన్ ప్లాటు, మరో రూ.5లక్షలు అందజేశారు. అనేక సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్యాకేజీలు, పరిహారాలే కాకుండా ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి గుడి, బడి, అంగన్‌వాడీ కేంద్రాలు అవసరమైన స్థాయిలో లేకపోవడం, శ్మశాన వాటికలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ పెండింగ్ సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఒక్క రూపాయి కూడా విదిల్చ లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వీరి సమస్యల పరిష్కారానికి ఒక్క పైసా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల్లో చేర్చడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారం అందేనా?మున్సిపల్ వార్డుల విభజనలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన ఓట్లను 7, 8, 9, 10, 11, 12వార్డుల్లో చేర్చి స్థానిక మున్సిపల్ అధికారులు ఈనెల 2న జాబితాను ప్రకటించారు. అయితే.. ఈ జాబితా ప్రకటనపై నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలను ఆదరాబాదరాగా రద్దు చేసిన అధికారులు.. మున్సిపాలిటీలో అధికారికంగా వార్డుల విలీనం తర్వాత... పెండింగ్ సమస్యలను ఇక ప్రభుత్వం పట్టించుకోదనే ఆందోళన వ్యక్తమవుతోంది. తమ గ్రామ పంచాయతీలను యథాతథంగా కొనసాగించి, మున్సిపాలిటీలో విలీనం చేయకుండా గజ్వేల్ మండలంలో కలపాలని 2023లో గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపామని గుర్తు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నిర్వాసిత కాలనీ వాసులు ఈనెల 5న స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు ఈ అంశాలపై తమ అభ్యంతరాలను తెలుపుతూ లేఖను అందజేశారు. తమ గ్రామాలను వార్డుల్లో మున్సిపల్ విలీనం చేయడం తప్పనిసరిగా భావిస్తే.. పెండింగ్ సమస్యలను పరిష్కరించిన తర్వాతే వార్డుల విభజన చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకుండా ముందుకు వెళితే.. సమస్యల పరిష్కారానికి సాంకేతిక అంశాలు అడ్డుగా మారొచ్చని ఆవేదన చెందుతున్నారు.
ఎంతకాలం
ఎదురుచూడాలి
పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఏళ్లతరబడి అధికార యంత్రాంగం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. సర్వం పోగొట్టుకొని వచ్చిన మాపై ఇంత చిన్నచూపు తగునా..? ఇప్పుడేమో మున్సిపల్ వార్డుల విభజన జరిగిందని చెబుతున్నారు. కానీ మా ఇబ్బందుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.
–హయాతొద్ధీన్, ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ
సమస్యలు
తీరే వరకు పోరాడుతాం
మా సమస్యలను పరిష్కరించేంత వరకు వివిధ రూపాల్లో పోరాడుతూనే ఉంటాం. గ్రామ పంచాయతీలను యథాతథంగా కొనసాగించాలి. మా అభిప్రాయాలను తెలుసుకోకుండానే మున్సిపల్ వార్డుల విభజన చేశారు. ఇదేం తీరు..?
–ఆశోక్, అర్‌అండ్‌ఆర్ కాలనీ


