మీ పిల్లల భవిష్యత్‌కు ఇదే నాంది
● ఎమ్మెల్యే హరీశ్‌రావు
● పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీకాన్ఫరెన్స్
సిద్దిపేటజోన్: ‘‘కొద్దీ రోజుల్లో మీ పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఇది అత్యంత కీలకమైన ఘట్టం. మంచి మార్కులతో గట్టెక్కితే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంది. మీ పిల్లల భవిష్యత్‌కు పదవ తరగతి ఫలితాలు నాంది’’ లాంటివని ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదవ తరగతి ఫలితాల్లో నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలనాం్నరు. పిల్లలను సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండేలా చూడాలని, విందులు, వినోదాలు, సినిమాలు, టీవీల జోలికి పోకుండా వారిని పరీక్షలు పూర్తయ్యే వరకు జాగ్రత్తగా గమనించాలని సూచించారు. వ్యవసాయ పనులు, ఇంటికి సంబంధించిన పనులు చెప్పొద్దని సూచించారు. నియోజకవర్గ పరిధిలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని తన ఆకాంక్ష అని, ఇందుకు మీరు సహకరించాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటీలో 169 సిద్దిపేట పిల్లలు సీట్లు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. మంచి ఫలితాలు సాధించడానికి ప్రత్యేక తరగతులు, అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే.. డిజిటల్ కంటెంట్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు.


