రిజర్వేషన్.. టెన్షన్!
ఆశావహుల్లో టెన్షన్
సాక్షి, సిద్దిపేట: పుర పాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండటంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో గుబులు మొదలైంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల పురపాలక సంఘాల పాలకవర్గాల పదవీకాలం గతేడాది జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సిద్దిపేట పురపాలక సంఘం పాలక వర్గం ఈ ఏడాది మే వరకు ఉంది.
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వేగంగా కసరత్తు చేస్తోంది. పదవీ కాలం ముగిసిన నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులుండగా 1,01,090 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఓటరు ముసాయిదాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 12న ఓటరు తుది జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13న పోలింగ్ స్టేషన్ల వివరాలను టీ పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. గత మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు గజ్వేల్ మున్సిపాలిటీ ఓసీ జనరల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు జనరల్ మహిళకు కేటాయించారు.
పలువురు ఇప్పటికే గ్రౌండ్ వర్క్
కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆశావహులు ఇప్పటికే ఆయా వార్డుల్లో గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు వార్డులపై దృష్టి పెట్టారు. ఏ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే దానిని నుంచి పోటీ చేయాలని ముందస్తు జాగ్రత్తతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జనం మధ్యనే ఉంటున్నారు. ఆయా కాలనీలలో ఏదైనా సమస్యను ప్రజలు దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎన్నికలకు ముందే ప్రజల మన్ననలు పొందాలని ఆశావహులు ఉత్సాహంగా ముందుకు పోతున్నారు.
కీలకంగా మారనున్న
చైర్మన్ స్థానం
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానం రిజర్వేషన్ కీలకంగా మారనుంది. ఈ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలోని ప్రధాన నాయకులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ కుర్చీపై కన్నేసిన ఆయా సామాజిక వర్గాల నేతలు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చే విధంగా చూడాలని అధికార పార్టీ నేతలను ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
పుర ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు
12న వార్డుల వారీగా ఓటరు తుది జాబితా విడుదల
రిజర్వేషన్‌పై ఆశావహుల్లో ఉత్కంఠ
మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఎలా ఉంటాయో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రిజర్వేషన్లలో మహిళ, జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల కేటాయింపు రొటేషన్ పద్ధతిలో ఉంటాయా?.. కొత్త రిజర్వేషన్లు అమలు చేస్తారా? అని ఆశావహులు జోరుగా చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్‌లు కలిసి రాకపోతే జనరల్ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


