ఇష్టం లేకుంటే వెళ్లిపోండి
సాక్షి, సిద్దిపేట: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఈజీఎస్ పనుల ప్రగతిపై మండలాలు, గ్రామాల వారీగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనిచేయడానికి ఇష్టం లేనివారు వెళ్లిపోవచ్చన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల వారీగా ఉపాధి హామీ కూలీలకు పని దినాలు కల్పించాలన్నారు. పంచాయతీ, అంగన్వాడీ భవనాలు ఇతర నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. రెండు రోజుల్లో టెక్నికల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేస్తామన్నారు. గ్రామాల వారీగా ఉపాధి హామీ కూలీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు పనిదినాలు కల్పించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, జెడ్పీ సీఈఓ రమేష్, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కొండపాక(గజ్వేల్): సమగ్ర ఓటరు జాబితా సవరణలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. కుకునూరుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ తీరులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన పనులన్నీ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని కోరారు. ఎలక్టోరల్ మ్యాపింగ్ పనులు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ పట్ల నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించబోమని చ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్ సుజాత, ఆర్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఫిబ్రవరి 15లోగా ఉపాధి పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ హైమావతి ఆదేశం


