డబ్బులిచ్చుకో.. దందా చేస్కో!
ఒక్కో వైన్ షాప్ నుంచి రూ.2.5 లక్షలు ఇవ్వాలంటూ హుకుం మామూళ్లతో బెంబేలెత్తుతున్న మద్యం వ్యాపారులు జిల్లాలో 93 వైన్ షాప్‌లు
ఎకై ్సజ్ అధికారుల అక్రమ వసూళ్లు
‘ఊరూరా బెల్టుషాపులు నడుపుకోండి.. ఎమ్మార్పీపై ఎంతైనా అదనంగా వసూలు చేసుకోండి.. అక్రమాలు ఎన్ని ఉన్నా మీపై ఈగ వాలనివ్వం.. మేం అడిగిన డబ్బులు ఇచ్చుకోండి.. ’ జిల్లాలో ఇదీ ఎకై ్సజ్ అధికారుల తీరు. కప్పం కడితే అన్నీ మేం చూసుకుంటాం అంటూ కొత్త ఎకై ్సజ్ పాలసీలో (2025–27) మద్యం వ్యాపారులకు చెప్పి భారీగా డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు ప్రచారం. ఒక్కో దుకాణం నుంచి ఏకంగా రూ.2.5లక్షలు వసూలు చేస్తుండటంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేసి నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే వసూళ్లు ఏమిటంటూ వ్యాపారులు వాపోతున్నారు.
– సాక్షి, సిద్దిపేట
జిల్లాలో 93 మద్యం దుకాణాలున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభమైంది. మద్యం తెప్పించుకున్నారు.. సర్పంచ్ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగాయి. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయంలోనే రెండేళ్లకు కొంత డబ్బు.. మళ్లీ నెల నెల రూ.15వేలు ఇవ్వాలని ఎకై ్సజ్ అధికారులు అక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారు.. దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా రూ.2.32 కోట్లు!
కింది స్థాయి నుంచి పైవరకు..
వసూలు చేసిన డబ్బును కింది స్థాయి నుంచి పై అధికారి వరకు పంపకాలు జరుగుతాయని తెలిసింది. గతంలో రూ.1.5 లక్షలు వసూలు చేశారని పాత మద్యం వ్యాపారులు చెబితే.. ఈసారి జిల్లాలో ఇద్దరు అధికారులు పెరిగారని, అందుకే ఎక్కువ వసూలు చేస్తున్నామని చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. షాప్ ప్రారంభంలోనే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, దీనికి తోడు అధికారులకు అక్రమ వసూళ్లతో దిక్కుతోచనిస్థితికి గురవుతున్నామని చెబుతున్నారు. కాస్త సమయం ఇవ్వండి అని అడిగినా పట్టించుకోవడం లేదని కొందరు మద్యం వ్యాపారులు వాపోతున్నారు.
కొత్తగా వైన్ షాప్ దక్కించుకున్న సంతోషం.. మద్యం వ్యాపారుల్లో ఉండటం లేదు. ఇప్పటికే షాప్ కోసం అద్దెకు తీసుకోవడం.. ఫస్ట్ క్వార్టర్ డబ్బులు చెల్లించడం, ఫర్నిచర్ తయారు చేయించడం ఇలా ఇప్పుడే సర్దుకుంటున్న సమయంలోనే ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు కప్పం కట్టాలని అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో వైన్ షాప్ నుంచి రూ.2.5లక్షలు ఇవ్వాలని మద్యం వ్యాపారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా 93 వైన్ షాప్‌ల వద్ద వసూలు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.32కోట్లు వసూలు చేయనున్నారు. అధికారులతో ఇబ్బంది ఎందుకని.. ఇబ్బంది పడుతూనే డబ్బులను ఎకై ్సజ్ అధికారులకు ముట్టచెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులే కాకుండానే ప్రతి నెలా ఒక్కో వైన్ షాప్ రూ.15వేలు ఇవ్వాలని ఎకై ్సజ్ అధికారులు చెప్పతున్నట్లు మద్యం వ్యాపారుల్లో జోరుగా చర్చసాగుతోంది.
నా దృష్టికి రాలేదు
మద్యం దుకాణాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. అలాంటి తప్పుడు పని చేయవద్దు. స్టేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తాను. అలాంటి వారి పై చర్యలు తీసుకుంటాం.
–శ్రీనివాసమూర్తి, ఈఎస్, సిద్దిపేట


