యేసయ్య కోవెల ముస్తాబు
క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు
మెదక్‌జోన్: పరలోక ప్రభువు ఏసయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబవుతోంది. ఇప్పటికే పర్యాటకులు, భక్తుల తాకిడి మొదలైంది. దీంతో మెదక్‌లో సందడి నెలకొంది.
అపురూపం.. కట్టడం
మెదక్ సీఎస్‌ఐ చర్చి నిర్మించి 101 సంవత్సరాలు అవుతోంది. గతేడాది జరిగిన శత జయంతి వేడుకలకు గవర్నర్, సీఎంతో పాటు పలువురు మంత్రులు సైతం హాజరయ్యారు. చర్చి అభివృద్ధికి రూ. 29.50 కోట్లు మంజూరు చేయటంతో, ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా గురువారం ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించనుండడంతో అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా చర్చి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక దుకాణాలు, రంగుల రాట్నాలతో చర్చి ఆవరణ జాతరను తలపిస్తోంది. సుందర కట్టడంగా పేరొందిన మెదక్ కెథడ్రల్ చర్చి ఎందరో మహానుభావుల అర్కెటిక్ పనితనంతో ఇంకా సుభాగా విరాజిల్లుతోంది. ప్రత్యేకంగా క్రిస్మస్ సందర్భంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది.
590 మందితో బందోబస్తు
క్రిస్మస్ నేపథ్యంలో 590 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ సీఐ మహేశ్ తెలిపారు. ఇందులో మెదక్‌తో పాటు సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొంటారు. 4 గురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 45 మంది ఎస్సైలతో పాటు 5 సెక్టార్లకు సంబంధించిన పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు. ఐడీపార్టీలు, క్యూఆర్‌టీంలు, షీటీంలతో పాటు 100 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. చర్చి ఎదుట పోలీస్ కంట్రోల్ రూం సైతం ఏర్పాటు చేస్తున్నారు.
విద్యుత్ దీపాల కాంతుల్లో చర్చి


