యేసు బోధనలు ఆచరణీయం
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు
హుస్నాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు బాగుండాలని ఏసుప్రభు చేసిన బోధనలు ఆచరణీయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని లక్ష్మి గార్డెన్‌లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగవంతుడే స్వయంగా ఏసుక్రీస్తు అవతారం ఎత్తి.. ప్రజలు సన్మార్గంలో ఉండాలని బోధనలు చేశారన్నారు. ద్వేషభావాలు లేకుండా మానవ జాతి ప్రశాంతంగా ఉండాలని మంచిని ప్రభువు నేర్పారని తెలిపారు. స్థానికంగా క్రైస్తవ కమ్యూనిటీ హాల్‌కు స్థలం చూపించి భవన నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయి, కాలువలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, మెడికల్ పరంగా పీజీ కళాశాలతో పాటుగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలతో ఈ ప్రాంతం బాగుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సర్పంచ్‌లు, పాస్టర్లు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ
హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీతోపాటు స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా అధికారులు పరిష్కరించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లులు వారం రోజుల్లో విడుదల అవుతాయన్నారు. జనవరి మొదటి వారంలో సర్పంచ్‌లు, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామన్నారు.


