జహీరాబాద్: వర్షాల కారణంగా జహీరాబాద్ ప్రాంతంలో నేలవాలిన చెరుకు పంటను రైతులు అమ్ముకోక తప్పడం లేదు. వర్షం కారణంగా దారులు బురదమయంగా మారడంతో తరలించుకోవడం సాధ్యం కాని రైతులు పంటలు నేలపైనే వదిలేశారు. 65వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రైతులు మాత్రం జ్యూస్ కోసం విక్రయించుకుంటున్నారు. మరో రెండు రోజులైతే చెరుకు వంకరగా మారుతుందని, దీంతో చెరుకు రసం కోసం కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రారని రైతులు వాపోతున్నారు. చెరుకు క్రషింగ్ ప్రారంభించే నాటి వరకు పంటను సాగులో ఉంచే అవకాశం లేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు విన్నవించుకుంటున్నారు.


