● స్థలాల ఎంపికకు కలెక్టర్లకు ఆదేశం
● చర్యలు చేపట్టిన ప్రభుత్వం
● పక్కా భవనాలతో తీరనున్న వెతలు
నారాయణఖేడ్: అద్దెభవనాల్లో అవస్థల మధ్య కునారిల్లుతున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సరైన సదుపాయాలు, సౌకర్యాలు లేక తాత్కాలిక భవనాల్లో గురుకులాలను నెట్టుకొస్తున్నారు. సరిపడా పాఠశాల గదులు, డార్మెట్రీ, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, ప్లే గ్రౌండ్ సదుపాయాలు లేక విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. దీన్ని నివారించి ఆహ్లాదకర వాతావరణంలో అన్ని సౌకర్యాల మధ్య విద్యార్థులకు విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. అందుకనుగుణంగా పక్కా భవనాలు నిర్మించాలని సంకల్పించింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, సంబంధిత అధికారులు మలయ్యభట్టు, అలోక్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి సమీక్షించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా పక్కా భవనాలు లేని గురుకులాలకు వెంటనే స్థలాలు పరిశీలించాలని ఆదేశించారు. ఇప్పటికే స్థలం అందుబాటులో ఉన్న గురుకులాలకు భవనాల నిర్మాణాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి అవసరమైన నిధులు మంజూరుకు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి సూచించారు.
అన్నీ అద్దె భవనాలే..
ఉమ్మడి జిల్లాలో 21 బీసీ గురుకులాల్లో తునికిలోని బాలుర మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులం ఒక్కటే పక్కా భవనంలో కొనసాగుతుండగా..అన్ని భవనాలు అద్దె, తాత్కాలిక పద్ధతిలో కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది గురుకులాలు ఉండగా సంగారెడ్డి ఆర్సీవో పాయింట్, ఝరాసంగం బాలుర, బాలికల, దిగ్వాల్, బాచేపల్లిలోని గురుకులాలు తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. సదాశివపేట, జోగిపేటల్లోని గురుకులాలను సంగారెడ్డిలో, సంగారెడ్డిలోని సెంటర్ కొత్లాపూర్‌లో నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఎనిమిది గురుకులాలు ఉండగా కౌడిపల్లిలోని సెంటర్ తునికిలోని గురుకులంలోనే నిర్వహిస్తున్నారు. హవేళిఘనాపూర్, మెదక్‌లో బాలుర, బాలికల, అల్లాదుర్గంలోని గురుకులం పటాన్‌చెరు ప్రాంతం చిన్న కంజర్లలో, పెద్దశంకరంపేటలోని గురుకులం ఖేడ్‌లోని మోడల్ డిగ్రీ కళాశాల హాస్టల్ భవనంలో, కళాశాల పటాన్‌చెరులోని చిన్న కంజర్లలో నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 5 గురుకులాలకు గాను దౌల్తాబాద్, సిద్దిపేట కేసీఆర్ నగర్, గొల్లపల్లి, హబ్సీపూర్‌లలో తాత్కాలిక భవనాల్లో ఉండగా నారాయణరావుపేట్‌లోని గురుకులం కొండపాకలో నిర్వహిస్తున్నారు.
ఇరుకు గదులతో అవస్థలు..
ఒక్కో గురుకులంలో 5 నుంచి 10వ తరగతి వరకు ఉండగా 400 నుంచి 420 మంది విద్యార్థులు ఉంటారు. జూనియర్ కళాశాల ఉన్న గురుకులంలో అదనంగా మరో 120 మంది వరకు విద్యార్థులు ఉంటారు. సదుపాయాలు లేక ఇరుకు గదుల్లో ఉదయం పాఠశాల, రాత్రి నిద్రించడం ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. పదిలోపే మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉండగా ఇతర సదుపాయాలు లేక విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆటలకు సరైన ప్లే గ్రౌండ్ కూడా లేకపోవడంతో విద్యార్థులు వాటికి దూరమవుతున్నారు. పక్కా భవనాలకు స్థలాలు నిర్ధారించి నిర్మించిన పక్షంలో విద్యార్థులకు సౌకర్యవంతంగా మారనుంది.


