హత్నూర(సంగారెడ్డి): ఎదురుగా వస్తున్న బైకును ఆటో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన హత్నూర మండలం గుండ్ల మాచనూర్ గ్రామ శివారులోని సంగారెడ్డి–దౌల్తాబాద్ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. హత్నూర మండలం చింతలచెరువుకు చెందిన జూలూరి నర్సింహులు (55) ఇస్మాల్ ఖాన్ పేట్ వెళ్లి తిరిగి బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా గుండ్లమాచునూరు శివారులో.. మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామానికి చెందిన మాణిక్యరావు (50) భార్య లక్ష్మితో కలిసి ఆటోలో వస్తుండగా బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో నర్సింహులు, మాణిక్యరావులకు తీవ్ర గాయాలు కాగా మాణిక్యరావు భార్య లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి ముగ్గురిని తరలించారు. ఆటోడ్రైవర్ మాణిక్యరావు ఆస్పత్రికి చేరుకుంటున్న సమయంలోనే మృతి చెందాడు. నర్సింహులు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే సంగారెడ్డి లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సాయంత్రం మృతి చెందారు. మాణిక్యరావు భార్య లక్ష్మితో కలిసి ఇంటి నిర్మాణ పనులు చేస్తూ చిన్న శంకరంపేట గ్రామంలో నివాసం ఉంటున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పనులు చేసేందుకు భార్య లక్ష్మితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
కూతురు డాక్టర్ అయిన కొద్ది రోజులకే..
కూతురు డాక్టర్ అయిన నెల రోజుల్లోనే తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జూలూరి నర్సింహులుకు భార్య లక్ష్మి తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు పెళ్లి చేశారు. చిన్న కూతురు అనూషను విదేశాల్లో ఎంబీబీఎస్ డాక్టర్ చేయించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని కూతురు సుమారు నెల రోజుల క్రితమే ఇంటికి చేరుకుంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
ఇద్దరు దుర్మరణం


