హుస్నాబాద్‌రూరల్: చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఎస్సై లక్ష్మారెడ్డి, సీఐ శ్రీధర్ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 5న మండలంలోని మహ్మదాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు కాసాని శివరాజు అదే గ్రామంలోని రవీందర్‌రెడ్డి ఇంటి సిమెంట్ రేకులను పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. కాగా బీరువాను సైతం పగులగొట్టి అందులోని రూ.40 వేలను దొంగిలించాడు. పోలీసులు విచారణ జరిపి, నిందితుడు శివరాజును పట్టుకొని, అతని వద్దనుంచి రూ.40వేలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పర్చారు.
70 తులాల వెండి, రూ.30వేల నగదు చోరీ
వట్‌పల్లి(అందోల్): పట్టపగలు గుర్తు తెలియని దొంగలు తాళం వేసిన ఇంట్లో పడి వెండి ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన అందోల్ మండలంలోని అల్మాయిపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. జోగిపేట పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి వీరమణి పొలం పనులకు వెళుతూ ఇంటికి తాళం వేసి వెళ్లింది. గమనించిన దొంగలు గేట్, మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలో ఉన్న 70 తులాల వెండి ఆభరణాలు, రూ.30వేల నగదును దోచుకెళ్లారు. ఆమె కుమారుడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చి చూసి తల్లికి విషయం చెప్పాడు. వెంటనే బాధితురాలు వచ్చి బీరువాను చెక్ చేయగా అందులో వెండి ఆభరణాలు, నగదు కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.


