దుబ్బాకటౌన్: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బుధవారం ఎస్‌ఐ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన బైండ్ల బాబు(38) పని నిమిత్తం దౌల్తాబాద్‌కు వచ్చాడు. పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో గ్రామ శివారులోని కల్వర్టు వద్ద బైక్‌ను అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి కల్వర్టు పక్కన ఉన్న కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
స్వగ్రామానికి వస్తుండగా కామారెడ్డి జిల్లా వాసి..
రామాయంపేట(మెదక్): రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై వై జంక్షన్‌వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్‌కు చెందిన జూపల్లి వెంకట్రావు (49) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. రాత్రి స్కూటీపై తన స్వగ్రామానికి వస్తున్న క్రమంలో జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడ్ని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు రిషి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


