పటాన్‌చెరు టౌన్: అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లోకకల్యాణం, సకాలంలో వర్షాలు కురవడం, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 108 మంది అర్చకులు, వేద పండితులు పాల్గొని స్వామివారికి మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి దేవనాదం, ప్రధాన అర్చకులు ప్రహ్లాద, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


