పాపన్నపేట(మెదక్): రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాపన్నపేటకు చెందిన ఆకుల కృష్ణ(40) స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కారోబార్‌గా పని చేస్తున్నాడు. బంధువుతో కలిసి బైక్‌పై పాపన్నపేట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో యూసుఫ్‌పేట శివారులో మెదక్ వైపు బైక్‌పై వెళ్తున్న ముస్లాపూర్ వాసులు ఢీకొట్టారు. దీంతో కృష్ణ బైక్ పైనుంచి ఎగిరి పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో మెదక్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి సైతం గాయాలయ్యాయి. మృతుడు కృష్ణకు భార్య, కూతురు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బైక్ అదుపుతప్పి..
జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ.లవకుమార్ కథనం ప్రకారం.. కర్నాటక బీదర్ పట్టణంలోని మంగల్‌పేటకు చెందిన అమోస్(27) తల్లి అనిత, కూతురు సన్నిధితో కలిసి ఈ నెల 9న జహీరాబాద్ పట్టణ సమీపంలో హుగ్గెల్లి చౌరస్తా వద్ద గల కల్వరీ టెంపుల్‌కు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో పస్తాపూర్ శివారులో ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో అమోస్‌తో పాటు అతడి తల్లి, కూతురుకు గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్‌లో వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమోస్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బీదర్‌కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కారు ఢీకొట్టడంతో గాయాలు
మునిపల్లి(అందోల్): కారు ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ అరవింద్ కథనం ప్రకారం.. రాయికోడ్ మండలం జౌరంగా నగర్ గ్రామానికి చెందిన బేగరి నర్సింహులు తన బైక్‌పై సదాశివపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని కంకోల్ శివారులో కారు ఢీకొట్టడంతో అతడికి గాయాలయ్యాయి. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు. నర్సింహులు అన్న నరేశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనం పైనుంచి పడిన వ్యక్తికి ..
మునిపల్లి(అందోల్): ద్విచక్ర వాహనం పైనుంచి పడిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. బుదేరా ఎస్‌ఐ అరవింద్ కథనం ప్రకారం.. సోమవారం రాత్రి పిల్లోడి గ్రామానికి చెందిన సాయిలు (30) పొల్కంపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. 112కు సమాచారం రావడంతో రక్తపు మడుగులో ఉన్న సాయిలును ఏఎస్‌ఐ అంజయ్య, హోంగార్డులు సదాశివపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సాయిలు బంధువులకు సమాచారం ఇచ్చారు.


