● 300 మంది గర్భిణులకు ప్రొటీన్ కిట్లు పంపిణీ ● నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి
కొల్చారం(నర్సాపూర్): ప్రతీ తల్లి ఆరోగ్యంగా ఉండటం, ప్రతీ బిడ్డ ఆరోగ్యంగా జన్మించడం సమాజ బాధ్యత అని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు, రంగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని 21 గ్రామాలకు చెందిన 300 మంది గర్భిణులకు ’ రాజన్న ఫౌండేషన్ ’ ఆధ్వర్యంలో మాతృదేవోభవ కానుక పేరిట ప్రొటీన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. గర్భిణులకు అవసరమైన పోషకాహారం అందించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ‘‘మాతృదేవోభవ’’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రొటీన్ కిట్ల ద్వారా అందించిన పోలిక్ యాసిడ్ సిరప్‌లను, బలవర్ధకమైన పదార్థాన్ని ప్రతిరోజు తీసుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణులతో కలిసి భోజనం చేసి, వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు మధుసూదన్ రెడ్డి, వెంకట్ గౌడ్ , సంగమేశ్వర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీరాములు, బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఏసు రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణ, శ్రీశైలం పాల్గొన్నారు.


