పాపన్నపేట(మెదక్): మెదక్ –బొడ్మట్‌పల్లి ప్రధాన మార్గంలో కొత్తపల్లి బ్రిడ్జి పక్కన వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం చేయకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆమె కొత్తపల్లి బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిపై, కనీసం అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గు చేటన్నారు. వారం లోగా రోడ్డు పనులు ప్రారంభించకుంటే భారీ ఆందోళన నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పదవిలోకి వచ్చి రెండేళ్ల తొమ్మిది నెలలు గడిచినా కొత్తపల్లి బ్రిడ్జిపై కనీసం అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. రోడ్డు లేకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కలెక్టర్, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఎమ్మెల్యే ఈ విషయంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వీరి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌న్ వెంకటరామిరెడ్డి, కాశీనాథ్‌రావు, మాజీ సర్పంచ్‌లు శ్రీనాథ్‌రావు, మల్లేశం, నాయకులు సోములు, దుర్గయ్య, అనిల్‌రెడ్డి, బాబాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రాము, సామేల్, మల్లేశం, చంద్రన్న ఉన్నారు.


