● ల్యాబోరేటరీ, స్కానింగ్ రూమ్ సీజ్ ● నిబంధనలు పాటించకుంటే చర్యలే ● జిల్లా వైద్యాధికారి లలితాదేవి
సంగారెడ్డి: ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని, జిల్లా వైద్యాధికారి లలితాదేవి హెచ్చరించారు. సంగారెడ్డి పట్టణంలోని కేబీఆర్ లైఫ్‌కేర్ ఆస్పత్రిలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా. కె. లలితాదేవి, డా. దీప్తి, డా. ఎ. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. ఆసుపత్రి ల్యాబోరేటరీలో గడువు ముగిసిన కిట్లు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. గడువు ముగిసిన కిట్లను వినియోగించడం వల్ల పరీక్షా ఫలితాలపై ప్రభావం పడటంతో పాటు రోగుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున ల్యాబోరేటరీని అధికారులు సీజ్ చేశారు. అలాగే ఆసుపత్రిలోని స్కానింగ్, అల్ట్రాసౌండ్ విభాగం అనుమతి రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో ముగుస్తున్నప్పటికీ, అనుమతిని పునరుద్ధరించేందుకు అవసరమైన దరఖాస్తు చేయనందున స్కానింగ్ సేవలు నిర్వహించకుండా అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు, రోగుల భద్రతా నిబంధనలు, చట్టపరమైన అనుమతులను పాటించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన మందులు, ల్యాబోరేటరీ కిట్లు లేదా ఇతర వైద్య సామగ్రిని వినియోగించడం, చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.


