సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ. దేశం అభివృద్ధి చెందాలంటే దానంతట అదే అభివృద్ధి కాదని, వ్యవసాయరంగం ప్రధాన వనరు అన్నారు. ప్రస్తుతం వ్యవసాయరంగం కుచించుకుపోతుందని, స్వేచ్ఛ, వాణిజ్యం ఒప్పందాల పేరుతో విదేశాలతో మన భారత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందన్నారు. గుజరాత్‌కు చెందిన ఆదానీ, అంబానీలు ఈ దేశాన్ని ఏలుతున్నారని ఆరోపించారు. వీళ్లకు ఏది కావాలంటే అది మోదీ చేసి పెడుతున్నాడని, మన గనులు, మన బొగ్గు దోచిపెట్టడంతో పాటు బ్యాంకుల నుంచి కావలసిన రుణాలు అందిస్తున్నాడని ఆరోపించారు. కార్మికులు, రైతులు, కూలీలు, ప్రజలు కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు బాగారెడ్డి, సహాయ కార్యదర్శి యాద గిరి, వ్యకాస నాయకుడు అశోక్, యూనియన్ల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


