17న ముసాయిదా జాబితా | - | Sakshi
Sakshi News home page

17న ముసాయిదా జాబితా

Aug 10 2026 7:20 AM | Updated on Aug 10 2026 7:20 AM

సంగారెడ్డి జోన్‌: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నారు. 17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరిస్తారు. అనంతరం తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. జూన్‌ 25 నుంచి జిల్లావ్యాప్తంగా సర్‌ ప్రక్రియ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 14,57,436 మంది ఓటర్లు ఉన్నారు.

రెండుసార్లు గడువు పెంపు

ఓటర్లు తమ ఎన్యూమరేషన్‌ ఫారాలు బీఎల్వోలకు అందించేందుకు ఎన్నికల సంఘం రెండుసార్లు గడువు పెంచింది. గత నెల 24న చివరి తేదీ ఉండటంతో పది రోజులు గడువు పెంచుతూ ఆగస్టు 3 చివరి తేదీ ప్రకటించింది. మరోసారి 7 రోజులు పెంచుతూ ఆగస్టు 10 వరకు ఫారాలు సమర్పించేందుకు గడువునిచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారంతో ఫారాల స్వీకరణ గడువు ముగుస్తుంది. బోగస్‌ ఓట్లను ఏరివేసి, కచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితాను రూపకల్పన చేసేందుకు చర్యలు చేపట్టారు.

79.17% డిజిటలైజేషన్‌ పూర్తి

జిల్లావ్యాప్తంగా 79.17% ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. నారాయణఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో 100% డిజిటలైజేషన్‌ పూర్తికాగా జహీరాబాద్‌లో 1.59, సంగారెడ్డిలో 8.18, పటాన్‌చెరులో 12.71% పెండింగ్‌లో ఉంది. జిల్లాలో ఇంకా 79,803 మందిని గుర్తించి ఎన్యూమరేషన్‌ పత్రాలు డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉంది.

తగ్గనున్న 2,23,212 మంది ఓటర్లు

జిల్లాలో 2,23,212 మంది ఓటర్లు తగ్గనున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 40,124 మంది మృతి చెందినట్లుగా గుర్తించారు. జహీరాబాద్‌లో అత్యధికంగా 9,683, నారాయణఖేడ్‌లో 5,359 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 27,891 మంది ఓటర్లను గుర్తించలేదు. 1,16,204 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నవారు 34,913గా తేలింది. ఫారాలు పోగొట్టుకొని, తమకు ఓటు హక్కు అవసరం లేదని, ఇతర కారణాలతో 4,079 మంది ఉన్నారు.

మిగిలింది ఒక్కరోజే

జహీరాబాద్‌ టౌన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) పత్రాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ మండలాల్లో దాదాపు పూర్తికావస్తుండగా మున్సిపల్‌లో మాత్రం వెనుకబడింది. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలున్నాయి. జహీరాబాద్‌ మండలంలో 37,224 ఓటర్లు ఉండగా 100%, ఝరాసంగం మండలంలో 37,363 మంది ఓటర్లు ఉండగా 99% న్యాల్‌కల్‌ మండలంలో 62 బూత్‌ల్లో 49,141 మంది ఓటర్లు ఉండగా 99.94%, కోహీర్‌ మండలంలో 44 బూత్‌లకు 37,885 ఓటర్లు 99.11%, కోహీర్‌ మున్సిపాలిటీలో 99.69%, జహీరాబాద్‌ మున్సిపాలిటీలో 73 బూత్‌లకు 79.742 మంది ఓటర్లకు 97%, మొగుడంపల్లి మండలంలో 99.88% పత్రాలను డిజిటలైజేషన్‌ చేశారు.

సవాల్‌గా మారిన 79,803 ఓటర్ల డిజిటలైజేషన్‌

గత ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో ఉన్న 79,803మంది ఓటర్లు డిజిటలైజేషన్‌ అధికారులకు సవాల్‌గా మారింది. ఇప్పటివరకు వీరి ఆచూకీ గుర్తించలేకపోయారు. వీరందరూ ఇతరప్రాంతాల్లో ఉన్నారా లేదా, మృతి చెందారా లేదా, ఓటు హక్కు వద్దు అనుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో పటాన్‌చెరులో 54,489, సంగారెడ్డి 20,827, జహీరాబాద్‌లో 4,487 మంది ఆచూకీ తెలియలేదు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిశ్రమల్లో ఇతర ప్రాంతాల వారు ఉండటంతో ఫారాలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

పెరుగనున్న పోలింగ్‌ కేంద్రాలు

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాన్ని రేషనలైజేషన్‌ చేస్తున్నారు. అవసరమైన చోట కొత్తగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 1,633 కేంద్రాలు ఉండగా రేషనలైజేషన్‌ అనంతరం కొత్తగా 16 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ లెక్కన 1,649 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

నేటితో ఎన్యూమరేషన్‌ ఫారాల సమర్పణ పూర్తి

17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు అభ్యంతరాలు

కొత్తగా ఏర్పాటు కానున్న 16 పోలింగ్‌స్టేషన్లు

పూర్తికావస్తున్న ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ

పెండింగ్‌లో 2,843 పత్రాలు

ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వడానికి ఒక్క రోజు మిగిలింది. పత్రాలు ఇవ్వని వారు వెంటనే సమీప బీఎల్‌ఓలకు ఇవ్వాలి. రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకారించాలి. మండలాలో్‌ల్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ బాగుండగా మున్సిపల్‌లో కొంత వెనుకబడింది. ఇంకా 2,843 పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయి.

–పి.దశరథ్‌,తహసీల్దార్‌ ,జహీరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement