ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ, ప్రభుత్వ కార్మిక, కర్షక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు సోమవారం దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ నర్సింహారెడ్డి తెలిపారు. పటాన్‌చెరు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ..మహాత్మాగాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించి స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత ఉధృతం చేశారన్నారు. అదే స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 10న జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ తోషిబా కార్మిక సంఘం నాయకుడు సుధాకర్‌రాజు, ఏషియన్ పెయింట్స్ హమాలీ కార్మిక సంఘం కార్యదర్శి రతన్‌సింగ్, వినోద్‌నాయక్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, యూత్ కాంగ్రెస్ నాయకుడు అక్షిత్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


