మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో జిల్లా సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలింతల కోసం ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బేటి బచావో బేటి పడావో పథకం కింద జిల్లాలోని మెదక్, చేగుంట, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్‌లోని బస్టాండ్లలో ఈ సెంటర్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్లలో తల్లులు బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామని డీడబ్ల్యూఓ హేమభార్గవి తెలిపారు. వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
సంగారెడ్డి క్రైమ్: ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రామునాయుడు వివరాల ప్రకారం.. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన శివరాత్రి రాజు(28), మూర్ఛ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం ఈ నెల 7న ఉదయం తన అన్నతో కలిసి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. మందులు తీసుకొని వస్తానని చెప్పి బయటకు వెళ్లి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనారోగ్య సమస్యలతో వ్యాపారి ఆత్మహత్య
సిద్దిపేటకమాన్: అనారోగ్య సమస్యలతో వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన శివకృష్ణమూర్తి (70) స్థానిక శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటూ సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. కాగా ఆయన కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పని నిమిత్తం హైదరాబాద్ వెళుతున్నానని ఇంట్లో చెప్పి ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ క్రమంలోనే స్థానిక కోమటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం చెరువులో కృష్ణమూర్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.


