కల్హేర్(నారాయణఖేడ్): ఇంట్లో నిద్రిస్తున్న మహిళ పాము కాటుతో మృతి చెందింది. ఈ ఘటన నిజాంపేట్ మండలం బాచేపల్లి కొత్త తండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మారోనిబాయి వ్యవసాయ పనులు ముగించుకుని వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. దీంతో కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మరణించింది. దీంతో తండాలో విషాదం నెలకొంది.
చికిత్స పొందుతూ వ్యక్తి..
పటాన్‌చెరు టౌన్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటక, కరెంజ్పికు చెందిన విజయ్ కుమార్ (34) హైదరాబాద్ పాత బస్తీకి 18 ఏళ్ల క్రితం వచ్చి బంగారు ఆభరణాల తయారీ పని చేస్తున్నాడు. కాగా స్వగ్రామానికి గత నెల 17న వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి బయలుదేరి హైదరాబాద్‌కి వరుసకు సోదరుడైన బాలాజీతో కలిసి వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వస్తున్నారు. ఈ క్రమంలో రామేశ్వరంబండా కూడలిలో ద్విచక్ర వాహనం పైనుంచి విజయ్ కుమార్ జారిపడ్డాడు. దీంతో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించగా ఈనెల 7న చికిత్స పొందుతూ మృతి చెందాడు.
చేపల వేటకు వెళ్లి..
పెద్దశంకరంపేట(మెదక్): చేపల వేటకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన జంబికుంట శివారులో శనివారం చోటు చేసుకుంది. పెద్దశంకరంపేట ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి వివరాలు.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన పట్నం బాలయ్య(24) చేపలు పట్టి అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. బ్యాక్‌వాటర్‌లో మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు బాలయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య వినోద సంఘటన స్థలానికి వెళ్లి తన భర్త బాలయ్య మృతదేహంగా గుర్తించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.


