విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
మిరుదొడ్డి(దుబ్బాక): ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలికల గురుకుల పాఠశాలను ఎలా తరలిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం మిరుదొడ్డిలోని గురుకుల బాలికల పాఠశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా.. దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారంలో ఉన్న పూలే బాలికల గురుకుల పాఠశాలను మిరుదొడ్డి మండల కేంద్రానికి తరలించారు. కాగా సరైన సౌకర్యాలు లేని పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన తెలుసుకున్న దుబ్బాక సీఐ రాజేశ్, మిరుదొడ్డి ఎస్‌ఐ సతీశ్‌తో పాటు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఆడుకోవడానికి సరైన ఆట స్థలం కూడా లేదని, పారిశుద్ధ్యం లోపించిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఇలాంటి పరిసరాల్లో తమ పిల్లలను ఎలా చదివించాలని ప్రశ్నించారు. కాగా ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ కరుణను వివరణ కోరగా.. శేరిపల్లి బందారంలో స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉందని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే మిరుదొడ్డి మండల కేంద్రానికి మార్చినట్లు వెల్లడించారు. కోతుల బెడద ఉన్నట్లు గుర్తించి వెంటనే పాఠశాల చుట్టూ సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం దుబ్బాక సీఐ రాజేశ్ విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి విద్యార్థులను కలుసుకునేలా ప్రత్యేక చొరవ చూపడంతో ఆందోళన సద్దుమణిగింది.


