ఆమ్యామ్యాలు | - | Sakshi
Sakshi News home page

ఆమ్యామ్యాలు

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

జిల్లాలో 8.30 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు..

అక్రమ కనెక్షన్లకు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అక్రమ నిర్మాణాలకు విద్యుత్‌ కనెక్షన్ల జారీలో కొందరు అధికారుల తీరు ఏ మాత్రం మారడం లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ)లు లేని నిర్మాణాలకు విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేసిన వ్యవహారంలో గతంలో కొందరు అధికారులు, సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై విజిలెన్స్‌ విచారణ కూడా జరిగింది. ఇంతజరిగినా కొందరు తీరు మార్చు కోవడం లేదు. ఓసీలు లేని నిర్మాణాలకు యథేచ్ఛగా విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఓసీలు లేని నిర్మాణాలకు కేటగిరీ మార్చి కనెక్షన్లు ఇస్తున్నారు. ఈ కనెక్షన్ల జారీల్లో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనల ప్రకారం 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న భవనాలు, అపార్టుమెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఇతర నిర్మాణాలకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ తప్పనిసరి.

తాత్కాలిక కనెక్షన్ల పేరుతో..

నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమ నిర్మాణాలకు విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేస్తున్నారు. టెంపరరీ కేటగిరీ కింద ఈ కనెక్షన్లు ఇస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఓసీలు లేని భవనాలకు టెంపరరీ కనెక్షన్‌ కూడా ఒక్కటే ఇవ్వాలి. ఎన్ని పోర్షన్లు ఉంటే అన్ని పోర్షన్లకు వేర్వేరుగా టెంపరరీ కనెక్షన్లు ఇవ్వకూడదు. కానీ ఆమ్యామ్యాలకు మరిగిన కొందరు అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలున్నాయి. ఓసీలు లేని భవనాలకు ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఇచ్చినట్లు ఆశాఖలో ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి, ఇంద్రేశం, ఇస్నాపూర్‌ వంటి మున్సిపాలిటీలతోపాటు, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం, తెల్లాపూర్‌ వంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్రమ నిర్మాణాలకు యథేచ్ఛగా విద్యుత్‌ కనెక్షన్లు..?

నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని..

ఓసీలు లేక అంతస్తులకు తాత్కాలిక కనెక్షన్లు

జిల్లాలో సుమారు 8.30 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉంటాయి. ఇందులో సుమారు 6.25 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉంటాయి. పట్టణీకరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో అనుమతిలేని నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి రాత్రికి రాత్రే అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలకు విద్యుత్‌ కనెక్షన్లు పొందేందుకు అక్రమార్కులు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పుతున్నారు. కబ్జాదారుల అవసరాన్ని కొందరు విద్యుత్‌ అధికారులు ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో దండుకుని విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement