జోగిపేట(అందోల్): జోగిపేట ఏరియా ఆస్పత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్)గా పనిచేస్తున్న డాక్టర్ రమేశ్ రోస్టర్ ప్రకారం 24 గంటలపాటు విధుల్లో ఉండాల్సి ఉండగా ఈ నెల 5న ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విధులు నిర్వహించి సంగారెడ్డికి వెళ్లిపోయి ఆయనకు బదులుగా ఆస్పత్రికి సంబంధంలేని డెంటల్ డాక్టర్ రవిని తన స్థానంలో కూర్చోబెట్టాడు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలే లీకు చేయడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వెంటనే డాక్టర్ రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తినడానికి వెళ్లినప్పుడు తన కోసం డాక్టర్ రవి వచ్చాడని, రాత్రి 9గంటల నుంచి ఉదయం వరకు విధులు నిర్వహించానని డాక్టర్ రమేశ్ చెబుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర ఇన్‌చార్జి కమిషనర్ ఆదేశానుసారం అధికారుల బృందం విచారణ చేపట్టారు.
డెంటల్ డాక్టర్ ఎవరు?
జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఒక డెంటల్ డాక్టర్ గత కొంత కాలంగా రిలీవర్ డాక్టర్‌గా కొనసాగుతున్నారు. సదాశివపేట ప్రాంతంలో డెంటల్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ రవి జోగిపేట ఆస్పత్రిలో రిలీవర్‌గా పనిచేస్తున్న విషయం ఆస్పత్రిలోని డాక్టర్లందరితోపాటు సూపరింటెండెంట్‌కు కూడా తెలిసి ఉంటుందని సిబ్బంది అంటున్నారు. కేవలం రమేశ్ డాక్టర్‌కు ఒక్కరికే రిలీవర్‌గా ఆయన పనిచేయడంలేదని ప్రస్తుతం ఆస్పత్రిలో పనిచేస్తున్న మరికొంతమందికి కూడా పనిచేసినట్లు తెలుస్తోంది.
మంత్రి దామోదర సీరియస్!
ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తును ఆదేశించారు.
పర్యవేక్షణ లోపంతోనే...
ఆస్పత్రిలో ఇంత జరుగుతున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్ పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంపై అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ప్రతీరోజు డాక్టర్ల సంతకాల రిజిస్టర్‌ను పరిశీలించాల్సిన ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఈ వ్యవహరంతో తేలిపోయింది. ఆమె కూడా విధులకు సరిగ్గా హాజరుకాకుండానే రిజిస్టర్‌లో మరుసటి రోజు వచ్చి సంతకాలు పెట్టినట్లుగా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డెంటల్ డాక్టర్ చాలా కాలంగా ఆస్పత్రి రిలీవర్‌గా పనిచేస్తున్న విషయం సూపరింటెండెంట్‌తోపాటు ఆర్‌ఎంఓకు సమాచారం ఉన్నా రమేశ్ డాక్టర్‌ను టార్గెట్ చేసి ఈ విషయాన్ని పత్రికా కార్యాలయాలకు లీకులు ఇచ్చారని తెలుస్తోంది.
చాలాకాలంగా రిలీవర్ డాక్టర్‌గా రవి విధులు
ఆస్పత్రి అధికారుల పర్యవేక్షణలోపమే కారణం
ఆస్పత్రి ఘటనపై మంత్రి దామోదర సీరియస్


