సంగారెడ్డి జోన్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పలు మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) ట్యాంకులు నిండాయన్నారు. రైతులు ప్రధానంగా పత్తి, సోయాబీన్, కంది పంటలను సాగు చేస్తున్నా రని పేర్కొన్నారు. రైతులను పంటల వైవిధ్యం వైపు ప్రోత్సహిస్తున్నామని, ఆరుతడి పంటల సాగు చేపట్టేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని వివరించారు.


