జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
పటాన్‌చెరు టౌన్: రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులపట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఇంద్రేశం, పెద్ద కంజర్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, భూ హక్కులు, అటవీ హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించారు.
సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలోని మహత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలల తనిఖీలను శుక్రవారం ఇంటెలిజెన్స్ అధికారి విజయ్‌చంద్రప్రసాద్‌రెడ్డి తనిఖీ చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కల్వకుంట, బైపాస్, కోత్లాపూర్‌లోని గురుకుల బాలికల, బాలుర బీసీ హాస్టల్‌ను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. బాలికల హాస్టల్‌లోని మరుగుదొడ్లు, కిచెన్, వాష్‌రూమ్‌లు, తరగతి గదులు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హాస్టల్ ప్రిన్సిపాల్‌కు ఆదేశించారు.
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శుక్రవారం ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం సాధన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు అబ్రహాం మాదిగ మాట్లాడుతూ..గుండెజబ్బు పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్లు చేయించాలనే డిమాండ్‌తో ప్రారంభించిన ఉద్యమమే నేడు ఆరోగ్యశ్రీ పథకం అమలుకు దారి తీసిందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పథకాన్ని అమలు చేశారన్నారు.
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలుభరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని కంబాలపల్లి,రేజింతల్ తదితర గ్రామాల్లో శుక్రవారం ఆటో ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి
హత్నూర(సంగారెడ్డి): గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకతీతంగా సర్పంచులకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి తెలిపారు. మల్కాపూర్ గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో శుక్రవారం హత్నూర మండల సర్పంచుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి మాట్లాడుతూ...గ్రామాల అభివద్ధి కోసం రాజకీయాలకతీతంగా సమన్వయంతో పనిచేసుకుని సమస్యల పరిష్కారానికి సర్పంచులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


