సంగారెడ్డి ఎడ్యుకేషన్: చదువు మధ్యలోనే ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం లాంటిదని, దీని ద్వారా తిరిగి చదువును కొనసాగించవచ్చని జిల్లా విద్యాధికారి రోహిణి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికతోపాటు బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ...పదవ, ఇంటర్మీడియెట్ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. ఈ నెల 15 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్లకు గడువు ఉందని తెలిపారు. ఓపెన్ స్కూల్‌లో జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 8,714 అడ్మిషన్లను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ లక్ష్యం చేరుకునే దిశగా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్లు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,273 అడ్మిషన్‌లు జరిగాయన్నారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ వెంకటస్వామి, డీఈఓ కార్యాలయ ఏడీ శంకర్, సూపరింటెండెంట్‌లు సురేఖ,రాజు, వనిత, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రోహిణి


