శిథిలావస్థలో ‘డబుల్‌ ఇళ్లు’ | - | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో ‘డబుల్‌ ఇళ్లు’

Aug 8 2026 8:43 AM | Updated on Aug 8 2026 8:43 AM

వర్షానికి ఉరుస్తుంది

నాకు ఇల్లు లేదు

మరమ్మతుల కోసం నిధులు మంజూరు

గత ప్రభుత్వంలో పుల్‌కల్‌లో నిర్మాణం

లబ్ధిదారులను ఎంపిక చేసినా

కేటాయించని ఇళ్లు

నిరుపయోగంగా మారిన వైనం

గత ప్రభుత్వ హయాంలో పుల్‌కల్‌ గ్రామంలో పట్లొల్ల మాణిక్‌ రెడ్డి వారసులు ఉచితంగా ఇచ్చిన భూమి సర్వే నం.199, 200, 201లో రెండెకరాల విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో 48 డబుల్‌ బెడ్రూంలు నిర్మించారు. ఒక్కో బ్లాకులో 12 ఇళ్లు ఉన్నాయి. కాగా అప్పుడే నిర్మాణాలు పూర్తి చేసి గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ వివిధ కారణాలతో ఇళ్లను కేటాయించలేదు. దీంతో నాలుగేళ్లుగా వృథాగా ఉండటంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు, కిటికీలను, వాష్‌ రూంలో టైల్స్‌ కూడా అపహరించారు. ఈ ఇళ్లను కొందరు రైతులు వ్యవసాయ పనిముట్లకు వాడుకుంటుండగా మరి కొందరు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు.

లబ్ధిదారుల ఆందోళన

గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్‌ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినా ఇళ్లను కేటాయించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఓ లబ్ధిదారుడు నిరసన తెలియజేస్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురయ్యాడు. కాగా ఈ ప్రమాదంలో అతడి కాలుని పూర్తిగా తొలగించడంతో దివ్యాంగుడయ్యాడు. అయితే ప్రభుత్వం మారడంతో లబ్ధిదారుల జాబితాను మార్పు చేస్తారేమోనని గత ప్రభుత్వంలో ఎంపికై న లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో పాత ఇళ్లలో ఉండలేక కొందరు శిథిలావస్థకు చేరిన డబుల్‌ ఇళ్లలోనే ఉంటున్నారు. లబ్ధిదారులు మరమ్మతులు చేయడం కష్టమౌతుందని అధికారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా డబుల్‌ ఇళ్ల పంపిణీపై క్రెడిట్‌ కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తహతహ లాడుతున్నాయి.

రూ.80 లక్షలతో ప్రతిపాదనలు

నాలుగేళ్ల క్రితం నిర్మించి లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో డబుల్‌ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్లకు మరమ్మతులు చేసి లబ్ధిదారులకు కేటాయించాలని సంకల్పించింది. దీంతో మరమ్మతులకు అధికారులకు ఆదేశాలిచ్చింది. డబుల్‌ ఇళ్ల వద్ద సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్‌ సరఫరా, నీటి సౌకర్యం, శౌచాలయాల నిర్మాణం, పేయింటింగ్‌ లాంటి పనులను గుర్తించి రూ.80 లక్షలతో ప్రతిపాధనలు పంపించారు. కాగా నిధులు మంజూరయ్యాయని, మరమ్మతులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తామని అధికారులు తెలిపారు.

నిరుపేదల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్రూమ్‌లు లబ్ధిదారులకు అందజేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాగా వాటికి మరమ్మతులు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించింది.

– పుల్‌కల్‌(అందోల్‌)

నా కుటుంబంలో ఎక్కువ మంది ఉంటాం. నాకు ఒక్క గది మాత్రమే ఉంది. ఆ గది కూడా ఇటీవల కురిసిన వానలకు ఉరుస్తుంది. దీంతో విధి లేక నా కుటుంబానికి గతంలో కేటాయించిన డబుల్‌ బెడ్రూంలో నివాసం ఉంటున్నాం. కూలీ పని చేసుకొని బతుకుతున్నాం.

–ఎండీ షాకీర్‌(లబ్ధిదారుడు)

నేను నివాసముండే ఇల్లు ఇటీవల కాలిపోయింది. దీంతో ఇప్పటి వరకు రేకుల షెడ్డులో నా కుటుంబం నివాసం ఉంది. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో అప్పట్లో కేటాయించిన డబుల్‌ బెడ్రూంలో నివాసముంటున్నాం. మాకు డబుల్‌ ఇల్లే దిక్కు.

–పాండురంగం (లబ్ధిదారుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement