అల్లాదుర్గం(మెదక్): కల్తీ మద్యం తాగి వైన్స్ పర్మిట్ రూంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అల్లాదుర్గంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్ వివరాల పక్రారం.. మండల పరిధిలోని చేవెళ్ల గ్రామానికి చెందిన రాయప్పగారి వీరన్న(48) గ్రామంలో వృద్ధురాలు మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఆ గ్రామంలో బెల్టు షాపుల నిషేధం అమలులో ఉంది. దీంతో మద్యం దొరకకపోవడంతో తాగేందుకు రాత్రి అల్లాదుర్గంలోని ఓ వైన్స్‌కు వచ్చాడు. అక్కడ మద్యం తాగి కిందపడ్డాడు. అపస్మారకస్థితిలో ఉన్న వీరన్నను చూసి వైన్స్ సిబ్బంది అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వీరన్న మృతి చెందినట్లు నిర్దారించారు. వైన్స్‌లో కల్తీ మద్యం తాగి తన తండ్రి మృతి చెందినట్లు కొడుకు మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


