ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మండల్ స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్లను సాధించుకుందామని, సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య చైర్మన్ శ్రీహరి యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక బీజేఆర్ చౌరస్తాలో మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీహరియాదవ్ మాట్లాడుతూ.. 1990 ఆగస్టు 7న భారత పార్లమెంట్ ఆమోదించిన మండల కమిషన్ సిఫారసులు నేటికీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. మండల్ కమిషన్ సిఫారసులని ప్రస్తుత జనాభా నిష్పత్తి ప్రకారం అమలు చేసే వరకు పోరాడాలన్నారు. కార్యక్రమంలో పెరక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ, వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు బోయ రాములు, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరే ఎల్లయ్య కురుమ, అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య యాదవ్ , వీరశైవ లింగ బలిజ సమాజం జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, యాదవ విద్యావంతుల వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ రాము యాదవ్ , నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్ కొత్వాల్, వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


