ఇలాగే లక్షల్లో చేపలు మృతి చెందిన చిట్కుల్ చెరువు ఇది. గతంలో ఇలాగే వర్షం నీటి మాటున రసాయన వ్యర్థాలు చెరువులోకి వదలడంతో చేపలన్నీ మృత్యువాత పడ్డాయి. దీనిపై హైకోర్టు కూడా సుమోటోగా విచారణ చేపట్టింది. బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశించి దాదాపు ఏడాది గడుస్తున్నా పీసీబీ అధికారులు బాధ్యులెవరో తేల్చలేదు. పైగా కాలుష్య కారక పరిశ్రమలు ఆ దరిదాపుల్లో లేవని నివేదిక ఇస్తూ ఏకంగా హైకోర్టునే పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. కాలుష్య కారక పరిశ్రమలు లేకపోతే లక్షల్లో చేపలు ఎలా మృత్యువాత పడ్డాయో ఆ విభాగం అధికారులకే తెలియాలి.
చనిపోయి నీళ్లల్లో తేలుతున్న ఈ వేలాది చేపలున్న ఈ చెరువు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం పెద్ద చెరువు. ఈ ఆదివారం వెలుగులోకి వచ్చింది. సమీపంలో ఉన్న రెడ్ క్యాటగిరీ పరిశ్రమలు వదలిన రసాయన వ్యర్థాలతో ఇలా సహజసిద్ధమైన ఈ చెరువు నీరు కాలకూట విషంగా మారి చేపలతోపాటు, అందులో ఉండే జీవజాలం మొత్తం నశించిపోయింది. చెరువునే నమ్ముకున్న మత్స్యకారులు తమ జీవనాధారం కోల్పోయారు. నెలవారీ మామూళ్లకే పరిమితమయ్యే కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు ఎప్పటిలాగే నీటి శాంపిళ్లను సేకరించి..ల్యాబ్‌కు పంపారు. పరిశ్రమల యాజమాన్యాలు ల్యాబ్ అధికారులను సైతం ‘ప్రభావితం’చేయడం పరిపాటే కావడంతో.. చెరువులో నీరు తమ లాగే ’స్వచ్ఛంగా’ఉందనే నివేదిక వస్తుందనే అభిప్రాయం నెలకొంది. అందుకే పీసీబీని పొల్యూషన్ క్యాష్ బోర్డుగా కూడా అభివర్ణిస్తున్నారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి :
తరచూ వెలుగులోకి..
కాలుష్య కారక పరిశ్రమలు చేస్తున్న విధ్వంసాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఫార్మా, రసాయన పరిశ్రమలు వర్షం నీటిలోకి వదులుతున్న రసాయన వ్యర్థాలతో స్వచ్ఛమైన చెరువుల నీరు కాటకూట విషంగా మారి జీవకోటి మనుగడకు శాపంగా మారుతోంది. పైన పేర్కొన్న ఉదాహరణలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పెద్దలను, అన్ని పార్టీల నేతలను ‘ప్రభావితం’చేయగల బడా బాబులవే ఈ పరిశ్రమలు కావడంతో పీసీబీ వీటిపై కనీస చర్యలు చేపట్టడం లేదనేది బహిరంగ రహస్యంగా మారింది.
నివేదికల పేరుతో దాటవేత
జిల్లాలో పరిశ్రమల్లో రెడ్ క్యాటగిరీ పరిధిలోకి వచ్చే పరిశ్రమలు సుమారు 800 వరకు ఉంటాయి. ఇందులో ఫార్మా, బల్క్‌డ్రగ్, కెమికల్ వంటి పరిశ్రమలున్నాయి. జెడ్‌ఎల్‌డీ (జీరో లిక్విడ్ డిస్‌చార్జి) ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని కాలుష్య జలాలు బయటకు రాకుండా పరిశ్రమలను నడపాల్సిన యాజమాన్యాలు ఇలా నిబంధనలకు విరుద్ధంగా రసాయన వ్యర్థాలను ఇష్టానుసారంగా వదలడంతో ఈ విధ్వంసాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చే వరకు స్పందించని పీసీబీ అధికారులు నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నారు. ల్యాబ్ రిపోర్టుల్లో అంతా స్వచ్ఛంగానే ఉన్నట్లు వస్తుండటం కూడా పలు ఆరోపణలు దారితీస్తోంది. దీంతో పీసీబీ చర్యలు చేపట్టిన దాఖలు కనిపించడం లేదు. రుద్రారం చెరువు ఘటనపై వివరణ కోసం ‘సాక్షి’ప్రతినిధి పీసీబీ కార్యాలయానికి ఫోన్ చేయగా..ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ విజయలక్ష్మి అందుబాటులో లేరు. నీటి శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామని తెలిపారు.
పరిశ్రమల రసాయన వ్యర్థాలతో రుద్రారం చెరువులో చేపలు మృతి
గతంలో చిట్కుల్ చెరువులోనూ ఇలాంటి ఘటనే..
హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టినా.. మారని తీరు
చర్యలు చేపట్టడంలో కాలుష్య నియంత్రణ మండలి మీనమేషాలు
శాంపిళ్ల సేకరణ..ల్యాబ్ రిపోర్టుల పేరుతో దాటవేత..
విమర్శలకు దారితీస్తున్న పీసీబీ అధికారులు తీరు


