నారాయణఖేడ్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ పోరాటస్ఫూర్తి ప్రతీ ఒక్కరికి మార్గదర్శకమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ క్యాంపు కార్యాలయ ఆవరణలో జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే ధారపోసిన మహనీయుడన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నగేశ్ షెట్కార్, కమిషనర్ ప్రశాంతి, కౌన్సిలర్లు జయంతిని నిర్వహించారు. జర్నలిస్టు కాలనీలో జయశంకర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, వివిధ ప్రభుత్వకార్యాలయాల్లో సంబంధిత అధికారులు చిత్రపటాలకు పూలమాలలు వేపి నివాళులర్పించారు.
మలిదశ ఉద్యమంలో ప్రధాన పాత్ర
జోగిపేట(అందోల్): తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా చిత్తశుద్ధితో తొలి, మలి దశ ఉద్యమాల్లో తనదైన పాత్రను పోషించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఒక్కరేనని అందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు తెలిపారు. జయశంకర్ 92వ జయంతి సందర్భంగా జోగిపేటలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన జయంతి సభకు వీరు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు తొట్ల రామకృష్ణ, రేఖాప్రవీణ్, జ్యోతి ప్రదీప్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


