● ఇద్దరు కార్మికులు పురస్కారానికి ఎంపిక
● రామప్ప, గొల్లభామ చీరలకు అవార్డులు
సిద్దిపేటజోన్: ప్రాచీన సంప్రదాయానుసారంగా కులవృత్తిలో దశాబ్దాలుగా ఇమిడిపోతున్న నేతన్నల శ్రమజీవన సౌందర్యానికి గుర్తింపు దక్కింది. వృత్తి నైపుణ్యాలతో అద్భుతమైన ప్రతిభ చూపిన ఇద్దరు చేనేత కార్మికులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇర్కోడ్ చేనేత సహకార సంఘానికి చెందిన హనుమంతు ఒకే చీరపై నేసిన ముత్యం పేట, గొల్లభామ చీరకు అవార్డు లభించింది. అదేవిధంగా సిద్దిపేట చేనేత సహకార సంఘానికి చెందిన వల్లకాటి అశ్విని నేసిన రామప్ప చీరకు కూడా అవార్డు దక్కింది. వీరిని చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది. రూ.25 వేల నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించనున్నారు.
ఏడేళ్లలో అవార్డు సొంతం
మహిళగా వంటఇంటికే పరిమితం కాకుండా.. చేనేతపై చూపిన ఆసక్తి ఏడేండ్లలో అవార్డు అందుకునేలా చేసింది. ఒకప్పుడు బీడీలు చేసి జీవనోపాధి పొందిన అశ్విని చీరలను నేయాలనే ఆసక్తి మేరకు వృత్తి వైపు దృష్టి సారించింది. మొదట్లో గొల్లభామ, చీటికీ చీరలు నేసి, రామప్ప దేవాలయం ప్రశస్తి తెలిపే ప్రతిమలను చీరపై నేశారు. 20 రోజుల పాటు కస్టపడి రామప్ప చీర తయారు చేశారు. ప్రభుత్వం ఈ యేడు రాష్ట్రస్థాయి అవార్డుకు అశ్విని నేసిన చీరను ఎంపిక చేసింది.
ఆసక్తి మేరకు..
చేనేత వృత్తిపై ఆసక్తి మేరకు నేను నేతపని మొదలు పెట్టా. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత వృత్తి నైపుణ్యాలను సాధించి నేడు గొల్లభామ, రామప్ప చీరలు నేస్తున్నా. ప్రస్తుతం బతుకమ్మ అందాలను చీరల మీద వేయడానికి ప్రయత్నిస్తున్నా. అవార్డు రావడం సంతోషంగా ఉంది.
– వల్లకాటి అశ్విని
కొత్తగా ఉంటుందని..
చేనేత వృత్తినే జీవనాధారం చేసుకొని నలభై యేళ్లుగా బతుకు బండిని నడుపుతున్నా. మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతాల్లో యేళ్ల కొద్దీ చేనేత వృత్తి లో మెళకువలను నేర్చుకున్నా. గొల్లభామ, ముత్యంపేట చీరలు రెండు వేర్వేరుగా ప్రసిద్ధి పొందాయి. వాటిని ఒకే చీరలో నేసి కొత్తదనం అందించే ప్రయత్నం చేసిన. చీర నేయటానికి 20 రోజులు పట్టింది. నేను నేసిన చీరకు రాష్ట్ర అవార్డు రావడం ఆనందంగా ఉంది.
– హనుమంతు, చేనేత కార్మికుడు


