సంగారెడ్డి జోన్: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి అందే అత్యవసర ఫిర్యాదులు, సమాచారం, నష్టం వివరాలను వెంటనే స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు, వరదలు, రహదారి అంతరాయాలు, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సమస్యలు, ఇతర ప్రమాదాల సమాచారాన్ని 08455– 276155 నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
జహీరాబాద్: మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం మొగుడంపల్లి మండల కేంద్రంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు బ్రెస్ట్ హెల్త్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. బ్రెస్ట్ కేన్సర్‌పై ముందస్తు అవగాహనతోనే వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందవచ్చన్నారు. అనంతరం ఎస్టీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: గ్రామాల సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గోప్యానాయక్ తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.15 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ, పలు తండాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే మండంలోని హంగర్గా(కె) నుంచి లాల్‌సింగ్ తండా వరకు నిర్మించనున్న ఫార్మేషన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, పంచాయతీ వ్యవస్థ బలోపేతం కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ వినోద్‌పాటిల్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, సర్పంచ్‌లు అనూషబాయి, మహాదేవి, శాంతకుమార్, ఉపసర్పంచ్ భాస్కర్, మనోహర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ విధానంలో అడ్మిషన్ పొంది అక్టోబర్‌లో జరిగే పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యాసకులు మీసేవ, టీజీ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతికి సంబంధించి ప్రతి సబ్జెక్టుకు రూ.100 థియరీ, రూ.100 ప్రాక్టికల్ అదేవిధంగా ఇంటర్మీడియెట్‌కు సంబంధించి ప్రతి సబ్జెక్టుకు రూ.150 థియరీ, రూ. 150 ప్రాక్టికల్ చెల్లించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 1 నంచి 17 వరకు, రూ.25 అపరాధ రుసుముతో ఆగస్టు 18వ తేదీ నుంచి 24 వరకు, రూ. 50 అపరాధ రుసుంతో ఆగస్టు 25 నుంచి 29వ తేదీ వరకు ఫీజు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి 8008403635 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని వర్గల్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుందని ఎంఈఓ మారుతి రాథోడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్ర వేశం కోసం నెల రోజులుగా అర్హులైన విద్యార్థు ల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 28న అర్హత పరీక్ష ఉంటుందని తెలిపారు.


