న్యాల్‌కల్(జహీరాబాద్): చాలా కాలం తర్వాత ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయాల పోస్టుల భర్తీని చేపట్టడంతో జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 20 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉద్యోగాలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన దాదాపు పూర్తి కావడంతో ఉద్యోగాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాలో 1,504 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వాటిలో 1,432 మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. 92 టీచర్, 154 మంది ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రాల పరిధిలో 10 వేల మంది గర్భిణులు, 9,800 మంది బాలింతలు, 98,500 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. వీరందరికీ వివిధ రకాల సేవలను అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు అందిస్తున్నారు. అయితే కేంద్రాల్లో నెలకొన్న ఖాళీల కారణంగా వీరంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభు త్వం ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసి ఈనెల 17 వరకు దరఖాస్తులు స్వీకరించింది.
254 పోస్టులు.. 2,773 దరఖాస్తులు
జిల్లాలోని 5 ప్రాజెక్టుల పరిధిలో గల 92 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 154 ఆయా పోస్టులకు గాను 2,773 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి 2,089 మంది, ఆయా పోస్టులకు 684 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీచర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు 20 మందికి పైగా పోటీ పడుతున్నారు. ఆయా పోస్టులకు సంబంధించి నలుగురికి పైగా పోటీ పడుతున్నారు. నారాయణఖేడ్ ప్రాజెక్టు పరిధిలో తీవ్ర పోటీ ఉంది. తమకు ఉద్యోగం వచ్చేలా చూడాలని అనుకూల నాయకులు, ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ కడతున్నారు.
అంగన్‌వాడీ పోస్టులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు


