సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని రైస్ మిల్లర్లు సీఎంఆర్ కోసం తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని వెంటనే పౌర సరఫరాల సంస్థకు అప్పగించాలని అదనపు కలెక్టర్ సంగీత ఆదేశించారు. ఈ బియ్యాన్ని డెలివరీ చేయడంలో ఎలాంటి జాప్యం చేయొద్దని అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాముల్లో తలెత్తుతున్న స్థలం సమస్యను ఎఫ్‌సీఐ అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. దీంతో సీఎంఆర్ బియ్యం డెలివరీ సజావుగా సాగేలా చూస్తామన్నారు. మూడేళ్ల క్రితం నిర్వహించిన వేలంలో తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బకాయిలను మిల్లర్లు వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. ఇందుకు మిల్లర్లు సానుకూలంగా స్పందించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మెనేజర్ జయశ్రీలాల్, ఎఫ్‌సీఐ మెనేజర్ మహేశ్, డీఎస్‌ఓ బాలసరస్వతి, మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు నరేందర్‌రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.
మిల్లర్లకు అదనపు కలెక్టర్ ఆదేశాలు


