ఆగస్టు నుంచి బియ్యం పంపిణీకి చర్యలు
● ఎల్‌నినో ప్రభావంతో ముందస్తు జాగ్రత్త
● ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ప్రభుత్వం
నారాయణఖేడ్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని ప్రజలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశ్యంతో మూడు నెలల రేషన్ సరుకులను ఒకేసారి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ప్రజలకు ఆహార భద్రతను కల్పించగలుగుతామని భావిస్తున్నారు. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ బియ్యం పంపిణీకి సంబంధించిన చర్యలు ప్రారంభించింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన సన్నబియ్యం ఒకేసారి జిల్లాలోని లబ్ధదారులకు అందనుంది. సాధారణంగా ప్రతీనెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం అందిస్తారు. వచ్చే నెలలో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనుండడంతో ఆగస్టు నెలలో నెల మొత్తం 31 రోజులపాటు దుకాణాలను తెరచి ఉంచి బియ్యం అందించాల్సి ఉంటుంది. మండల్ లెవల్ స్టాక్ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు మూడు నెలల రేషన్ సరుకులు సరఫరా కానున్నాయి. చిన్న దుకాణాలకు ఒకేసారి, పెద్ద దుకాణాలకు రెండు సార్లు బియ్యం రావాణా చేసి డంపు చేయనున్నారు. రేషన్‌కార్డు దారుడు మూడుసార్లు వేలి ముద్రలు వేసి సరుకులను పొందాల్సి ఉంటుంది. గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ సరుకులను అందజేశారు. ప్రస్తుతం ఎల్‌నినో దృష్ట్యా కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే బియ్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కలిపి 4.42 లక్షల రేషన్ కార్డులు ఉండగా 14.93 లక్షల మంది సభ్యులు కార్డులు కలిగి ఉన్నారు. వారికి ప్రతీనెల 9,400 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. ఆహార భద్రత కార్డు ఉన్న వారికి ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డులు ఉన్న వారికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు దారులకు 10 కిలోల సన్న బియ్యం అందిస్తారు.
ప్రభుత్వం ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యంను ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తుండడంతో స్టాకు భద్రపర్చడం డీలర్లకు ఇబ్బందికరంగా మారింది. ఒక్కసారిగా వందల క్వింటాళ్ళ బియ్యం ఎక్కడ ఉంచుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది చిన్నచిన్న ఇళ్లు, కొట్లలో రేషన్ దుకాణాలు నడుపుతున్నారు. అందులోనే సరుకులను భద్రపర్చుకొని పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒకేసారి అధిక మొత్తంలో బియ్యం వస్తే పెద్దపెద్ద గదులను అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి. వర్షాకాలం కావడంతో గదులు లభ్యం కావడం కష్టం. గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం నిల్వ చేసుకునేందుకు ఇళ్లు కూడా అంత త్వరగా లభించవు. దీంతో వచ్చే బియ్యం నిల్వలను ఎక్కడ ఉంచాలని మదన పడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు బియ్యం విడతల వారీగా సరఫరా చేయాలని కోరుతున్నారు. ప్రతీనెల అవసరమైన దానికంటే మూడింతలు ఎక్కువ బియ్యం ఒకేసారి తరలించడం, వాటిని లబ్ధిదారులకు అందించడం డీలర్లకు శ్రమతో కూడుకున్న పని.


