వట్‌పల్లి(అందోల్): స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ భద్రతకు అత్యంత కీలకమైన అంశం. ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభ సమయానికి ముందే విద్యా సంస్థల బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలి. కానీ ఫిట్‌నెస్ చేయించుకోని బస్సులను రోడ్డుపై తిప్పేందుకు అవకాశం లేదని నిబంధనలు చెబుతున్నాయి. మండల కేంద్రంలోని పాఠశాలల యాజమాన్యాలు ఆర్టీఏ నిబంధనలు పాటించకుండా, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండానే బస్సులను రోడ్లపైకి తీసుకువస్తున్నారు. కాగా పాఠశాల పునఃప్రారంభం తరువాత మండల విద్యాధికారి వట్‌పల్లిలోని మూడు ప్రైవేట్ పాఠశాలలకు బస్సుల ఫిట్‌నెస్ పత్రాలను సమర్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. రెండు పాఠశాలలు మాత్రం నాలుగు బస్సుల చొప్పున ఫిట్‌నెస్ పరీక్షలు తీసుకున్నట్లు సదరు పత్రాలను ఎంఆర్‌సీ కార్యాలయంలో సమర్పించారు. అక్షర పాఠశాల యాజమాన్యం మాత్రం తమకు జూలై 10 వరకు గడువు ఇవ్వాలని రాతపూర్వకంగా కాగితం సమర్పించి ఎంఈఓను కోరారు. కానీ గడువు సమీపించినా బస్సుల ఫిట్‌నెస్ పత్రాలను మాత్రం అందజేయకపోవడంపై ఎంఈఓ రంజిత్‌కుమార్ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు.
అధికారుల నోటీసులు
ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను నడపొద్దని మండల విద్యాధికారి.. అక్షర స్కూలుకు నోటీసులు జారీ చేశారు. అయినా ఆ పాఠశాల యాజమాన్యం మాత్రం దర్జాగా బస్సులను నడుపుతోంది. సుమారు నెల రోజులు దాటినా ఇప్పటి వరకు ఫిట్‌నెస్ పత్రాలు లేకుండానే బస్సులను రోడ్లపై తిప్పుతున్నప్పటికీ సంబంధిత రవాణా శాఖ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోడ్డెక్కుతున్న బస్సులు
నోటీసులు జారీ చేసిన ఎంఈఓ
లెక్కచేయని యాజమాన్యాలు


