ముందస్తు కార్యాచరణతో ముందుకెళ్దాం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడనున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక అమలుపై సోమవారం సంగారెడ్డి జెడ్పీ హాలులో సమీక్ష సమావేశం జరిగింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై లోతుగా చర్చించారు. వ్యవసాయం, తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్ వంటి అంశాలకు సంబంధించిన ప్రణాళికలను ఆయాశాఖల అధికారులు వివరించారు. ఈసందర్భంగా తెలంగాణ జలసిరి పోస్టర్‌ను, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక నివేదికను మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. స్పెషల్ సెక్రటరీ వాణిప్రసాద్, కలెక్టర్లు ప్రతీక్‌జైన్, ప్రతిమాసింగ్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, సంజీవరెడ్డి, సునీతారెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆయకట్టు రైతులను ఆదుకోవాలి
సింగూరుకు దిగువన ఉన్న ఘనపురం ఆనకట్ట ఆయకట్టు రైతులను ఆదుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తెచ్చారు. సింగూరు నుంచి నీటి విడుదలకు వీలు లేకుండా పోవడంతో వారికి సబ్సిడీ విత్తనాలు, ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలన్నారు. వీలైనంత త్వరగా సింగూరు మ రమ్మతులు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
కోతులకు కూ.ని. ఆపరేషన్ కేంద్రాలు
కోతుల బెడద కారణంగా చాలా గ్రామాల్లో వరి తప్ప, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. కోతుల సంతానాన్ని తగ్గించేందుకు ఆపరేషన్లు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపాలని మంత్రి వివేక్ కలెక్టర్లను ఆదేశించారు.
విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కరించండి
జిల్లా కేంద్రంతో పాటు, నియోజకవర్గంలో విద్యుత్, తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలి. అసంపూర్తిగా నాలుగు సబ్‌స్టేషన్ల పనులు వెంటనే పూర్తి చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి. సదాశివపేటలోని సిద్దాపూర్ తదితర కాలనీలకు తాగునీటి ఎద్దడి నెలకొంది. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అమృత్ తాగునీటి పథకాల పనులతో పాటు, విద్యుత్ పనులను కూడా వేగవంతం చేయాలి.
– చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే
అధికారుల మధ్య సమన్వయం అవసరం
‘అమృత్’ పనులపై ఆసక్తికర చర్చ
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోప్రత్యామ్నాయంపై సమీక్ష
మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ
ఇన్‌చార్జి మంత్రి వివేక్, బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డిల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. అమృత్ తాగునీటి పథకాల పనులు ఆలస్యంగా నడుస్తున్నాయనే అంశం సమావేశంలో చర్చ జరిగిన సందర్భంలో కేంద్రం నుంచి నిధులు సరిగా రావడం లేదని మంత్రి వివేక్ పేర్కొన్నారు. దీనిపై అంజిరెడ్డి స్పందిస్తూ.. కేంద్రం ముందే నిధులు మంజూరు చేసిందని, వాటిని సకాలంలో సద్వినియోగం చేసుకోవాల్సి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. జరిగిన పనులకు యూసీ (యుటిలిటీ సర్టిఫికెట్లు) పంపితే వెంటనే బిల్లులు వస్తాయని వివరించారు. వారం రోజుల్లో ఈ యూసీలను పంపుతామని వివేక్ పేర్కొన్నారు.


