సంగారెడ్డి: మార్షల్ ఆర్ట్స్‌లో విశేష ప్రతిభ కనబర్చి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి మాల్వే విహానను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విహాన తన తల్లిదండ్రులు రామేశ్వర్, అశ్వినిలతో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్నవయస్సులోనే ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించి సంగారెడ్డి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు. భవిష్యత్తులోనూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జైపాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, వసంత్‌రెడ్డి చిన్నారిని అభినందించారు.
లీకులు, అవినీతి తప్ప
అభివృద్ధి ఏదీ?
సంగారెడ్డి ఎడ్యూకేషన్: మోదీ పాలనలో దేశంలో లీకేజీలు, అవినీతి తప్ప అభివృద్ధి లేదని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం, విద్యార్థులపై మోపుతున్న నిర్బంధానికి వ్యతిరేకంగా సోమవారం జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించకుండా అణిచివేయాలను కోవడం కేంద్రానికి తగదని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నిరంకుశ చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్, సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, నాయకులు అశోక్, లక్ష్మి, నరసింహారెడ్డి, దత్తు పాల్గొన్నారు.
సఫారీ రైడ్‌కు రెడీ
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ జిల్లా సరిహద్దు పోచారం అభయారణ్యంలో వన్యప్రాణులను తిలకించేందుకు ఫారెస్టు అధికారులు కొత్త సఫారీ వాహనం మంజూరు చేశారు. పాత వాహనంతో కొన్ని ఇబ్బందులు కాగా, సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు నూతన హంగులతో కూడిన సఫారీ వాహనం పంపించారు. ఇందులో 10 మంది పర్యాటకులు ప్రయాణించడంతోపాటు వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా తయారు చేశారు. గతంలో పర్యాటకులు వచ్చిన సమయంలో పాత వాహనంలో అభయారణ్యంలోకి వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. దీంతో తమ సొంత వాహ నంలో ఫారెస్ట్ సిబ్బందిని తీసుకెళ్లి చూపించేవారు. నూతన సఫారీ ద్వారా హాయిగా అభయారణ్యంలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.


