నిప్పుల కొలిమి | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

ముదురుతున్న ఎండలు

నిర్మానుష్యంగా రహదారులు

ఆరెంజ్‌ జోన్‌లో పలు మండలాలు

బయటకి రావద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక

మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా సంగారెడ్డి కొత్త బస్టాండ్‌ ప్రాంతం

సంగారెడ్డి జోన్‌: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత అధికమవుతోంది. రానున్న రోజుల్లో ఎండలు నిప్పుల కొలిమిలా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శనివారం జిల్లాలో 41 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్‌, మే నెలలో 45 డిగ్రీల సెల్సీయస్‌ నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

నాలుగు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు

జిల్లా అంతటా 37 నుంచి 41 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో హత్నూర, కోహీర్‌, సిర్గాపూర్‌, జిన్నారం మండలాలను ఆరెంజ్‌ జోన్‌ హెచ్చరికను జారీ చేశారు. మిగతా మండలాల్లో కూడా దాదాపు అదే పరిస్థితులు నెలకొన్నాయి.

ఏసీ, కూలర్లు, ఫ్యాన్లతో ఉపశమనం

వేడి నుంచి ఉపశమనం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను పగలు రాత్రీ తేడా లేకుండా వినియోగిస్తూ ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. రేకుల ఇళ్లలో ఉన్న ప్రజలు మాత్రం వేడికి తట్టుకోలేక చెట్ల కిందకు వచ్చేస్తున్నారు.

ఏప్రిల్‌ 22 వరకు అధికమే

ఆదివారం నుంచి ఏప్రిల్‌ 22 వరకు జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 45–47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకురావడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో తమ పనులు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో విద్యుత్‌ సరఫరా అంతరాయం కలిగితే తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లినప్పుడు స్కార్ఫ్‌ ధరించడం, తలపై టోపీ పెట్టుకోవడంతో పాటుగా వివిధ రకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. జాతీయ రహదారులతోపాటు ప్రధాన, గ్రామీణ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలను దృష్టిలో ఉంచుకొని వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు వహించాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

గొడుగుతో

వెళ్తున్న యువతి

(డిగ్రీల సెల్సీయస్‌లలో)

మండలం ఉష్ణోగ్రతలు

హత్నుర 40.9

కోహీర్‌ 40.8

సిర్గాపూర్‌ 40.6

జిన్నారం 40.4

అమీన్‌పూర్‌ 39.5

కల్హేర్‌ 39.3

మునిపల్లి 39.2

సిర్గాపూర్‌ 39.2

పటాన్‌చెరువు 39.1

వట్‌పల్లి 39.0

మొగుడంపల్లి 39.0

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement