సంగారెడ్డి: ప్రతీ ఒక్కరికీ ఔషధాల వినియోగంపై సరైన అవగాహన తప్పనిసరని, మితిమీరి మందలు వాడటం కూడా ఆరోగ్యానికి హానికరమని డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాము పేర్కొన్నారు. సంగారెడ్డిలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్త్‌నింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ, కెమిస్ట్ భవన్‌లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఔషధాల దుర్వినియోగం, యాంటీబయాటిక్స్‌ను సరైన విధంగా వినియోగించడం, చెల్లుబాటయ్యే ప్రిస్క్రిప్షన్‌తోనే మందుల విక్రయం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనుమతి ఉన్న ఔషధ దుకాణాల వద్ద మాత్రమే మందులు కొనుగోలు చేయాలని సూచించారు. నాణ్యతలేని మందులపై ఫిర్యాదులకు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు. పలు అంశాలపై క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వసంతరావు, డ్రగ్స్ కంట్రోల్ డీఎస్పీ బి.పుష్పన్‌కుమార్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు రవికిరణ్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీకాంత్, ప్రవీణ్, వరప్రసాద్, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈర్ణ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి అనుముల సంతోశ్‌కుమార్, కోశాధికారి ఏదిరే రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాము


