ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి: సామాజిక సంస్కర్త మహాత్మ జ్యోతిరావుబా పూలే జయంతిని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనేఉన్న పూలే విగ్రహానికి కలెక్టర్ ప్రావీణ్యతో కలసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమోఘమన్నారు. మహిళా విద్య, సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను ఆచరిస్తూ సమాజంలో సమానత్వం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కుల దురహంకార హత్యలు ఆపాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కుల దురంహకార హత్యలను ఆపడంతోపాటు బాలికా విద్యను ప్రోత్సహించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావుబా పూలే జయంతి సందర్భంగా సంగారెడ్డిలో పూలే విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో తెలంగాణలో కుల దురహంకార హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. పూలే ఆశయమైన కులనిర్మూలన సాధించాలంటే ముందుగా ఇటువంటి హత్యలను నిరోధించాల్సిన అవసరముందని చెప్పారు. వితంతు పునర్వివాహాలను చేయించడం, బాల్యవివాహాలు రూపుమాపడం, బాలికా విద్య పెంపొందించడం కోసం పూలే నిరంతరం కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కోరారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, జిల్లా కార్యదర్శి సాయితేజ, సింహాచలం, ఆడిట్ కమిటీ కన్వీనర్ చందర్‌రాథోడ్, జిల్లా కమిటీ సభ్యులు సురేశ్, కృష్ణ, నాయకులు పి.రాజు, మనోహర్ పాల్గొన్నారు.


