రైతుబజార్‌లో ధరల బోర్డు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

రైతుబజార్‌లో ధరల బోర్డు ఏర్పాటు

Mar 4 2026 9:03 AM | Updated on Mar 4 2026 9:03 AM

సిద్దిపేటజోన్‌: పారదర్శకంగా సేవలు అందించే క్రమంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లో ధరల డిజిటల్‌ స్క్రీన్‌ లేకపోవడంతో మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు స్పందించారు. మంగళవారం రైతు బజార్‌లో ధరల డిజిటల్‌ డిస్‌ప్లే స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. ఇటీవల రైతు బజార్‌ను హరీశ్‌ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండేళ్లుగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల బోర్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించి వెంటనే డిజిటల్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఎట్టకేలకు ఏర్పాటు చేశారు.

గుండ్లు ఎత్తిన యువకులు

నారాయణఖేడ్‌: కాముడి దహనం అనంతరం హోళీ రోజున గ్రామాల్లో భారీ సైజు గుండ్లు ఎత్తి గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఈ ప్రాంతంలో ఆనవాయితీ. ఈ క్రమంలో మంగళవారం మండల పరిధిలోని తుర్కాపల్లిలో సాతిని జ్ఞానేశ్వర్‌ (105) కిలోల గుండును అవలీలగా ఎత్తి ప్రదక్షిణలు చేశారు. కాగా ర్యాకల్‌, వెంకటాపూర్‌, తదితర గ్రామాలకు చెందిన పలువురు యవకులు వంద కిలోల గుండును అవలీలగా ఎత్తారు. ఖేడ్‌ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో పోటాపోటీగా గుండ్లు ఎత్తారు. భారీ గుండ్లను అవలీలగా ఎత్తి ప్రదక్షిణ చేసిన యువకులను గ్రామ పెద్దలు అభినందించారు. అనంతరం హోళీ పండుగ వేడుకలను జరుపుకున్నారు.

హెచ్‌ఐవీ,

టీబీ నివారణపై కళాజాత

చేగుంట(తూప్రాన్‌): మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద మంగళవారం హెచ్‌ఐవీ, టీబీ వ్యాధుల నివారణపై కనకదుర్గ కళాసమితి బృందం సభ్యులు కళాజాత ప్రదర్శనతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ, టీబీ వ్యాధి వచ్చే అవకాశాలు ఆటపాటలతో వివరించి నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలు వివరించారు. హెచ్‌ఐవీతో పాటు టీబీ నివారణ కోసం ప్రభుత్వం ఆస్పత్రుల్లో అందించే సేవల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భుజంగం, దాసు, కృష్ణ, నిర్మల, స్కోప్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సుస్మిత, జ్యోతి, రేవతి తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనం దహనం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఈ ఘటన మెదక్‌ మండలం రాజ్‌పల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన మన్నె లక్ష్మినారాయణ రోజు మాదిరిగా బైక్‌ను ఇంటిముందు నిలిపాడు. సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు రావడంతో పక్కింటి వారు గమనించి ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే బైక్‌ కాలిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని మెదక్‌ రూరల్‌ ఎస్‌ఐ లింగం పరిశీలించి కేసు నమోదు చేశారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

వెల్దుర్తి(తూప్రాన్‌): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని కుకునూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చిప్ప సిద్ధిరాములు(62) మండల కేంద్రమైన వెల్దుర్తిలో సుమారు 40 ఏళ్లుగా మెడికల్‌ షాప్‌ నిర్వహిస్తూ ఇక్కడే స్థిరపడ్డాడు. వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లడానికి రోడ్డు డివైడర్‌ దాటే క్రమంలో వేగంగా వచ్చిన ఓ యువకుడు బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆప్యాయంగా పలకరించే సిద్దిరాములు మృతి పట్ల గ్రామస్తులతో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement