ఆసక్తి చూపిస్తున్న అన్నదాతలు
లభిస్తున్న గిట్టుబాటు ధర ● పొలం వద్దకే వ్యాపారులు
జహీరాబాద్ టౌన్: పుచ్చకాయలను ప్రజలు సీజన్‌తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు తెచ్చి పెడుతోంది. చాలా మంది రైతులు ఈ పంటను కొన్నేళ్లుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. రంజాన్ కావడంతో వ్యాపారులు పొలాల వద్దకు వచ్చి పంటను కొంటున్నారు. దళారుల బెడద లేకుండా మంచి లాభాలు వస్తుండటంతో రైతులు పుచ్చ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాలో అధికంగా పత్తి, సోయా, కంది తదితర పంటలు లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఏడాది పొడవునా కష్టపడి, వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు అమ్ముకోడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక దళారుల బెడదతో నష్టపోతున్నారు. కొంత మంది రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించి డిమాండ్ ఉన్న పంటల సాగు పై ఆసక్తి చూపుతున్నారు. వేసవిలో అధికంగా వినియోగించే పుచ్చకాయ సాగుపై దృష్టి పెట్టారు. లాభాలు తీసుకొచ్చి పెడుతుండటంతో చాలా మంది అన్నదాతలు ఈ సాగుకు మొగ్గుచూపుతున్నారు.
జహీరాబాద్ ప్రాంతంలో సాగవుతున్న పుచ్చకాయ పంట
పెరుగుతున్న సాగు విస్తీర్ణం
జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో పుచ్చ పంట సాగువుతుందని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. పంట కాలవ్యవధి 65 రోజులు మాత్రమే కాడంతో కొందరు మూడో పంటగా మరి కొంత మంది రెండో పంటగా వేస్తున్నారు. అంతరపంటగా కూడా పుచ్చ సాగు చేస్తున్నారు. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు పంట సాగవుతుంది. పంట చేతికి వచ్చే సరికి ఎకరాకి రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం కిలో రూ.20 పలుకుతుంది. పెట్టుబడి పోనూ ఎకరానికి లక్ష వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. దళారుల బెడద లేకుండా వ్యాపారులే పొలం వద్దకు వచ్చి కొంటున్నారు.
సస్యరక్షణ చర్యలు పాటిస్తే..
మేలైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యం. సాగులో పంట రకాలు, సస్యరక్షణ చర్యలు కీలకం. నీటి తడులు పరిమితికి మించి ఇవ్వరాదు. సూక్ష్మ పోషకాలు అందించే ఎరువులు వేసుకోవాలి. డ్రిప్ ద్వారా నీరు అందించడం మేలు. పిందె రాలకుండా ఫ్లూ పైరాడి ఫోరాన్ లేదా ఫిప్రోనిల్ 5 శాతం ఎస్‌సీ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర, బూడిత తెగులు ఆశిస్తే.. నివారణకు మందులు పిచికారీ చేస్తే సరిపోతుంది.
– సోమేశ్వర్‌రావు,
జిల్లా ఉద్యానశాఖ అధికారి


