అడవి పందుల బీభత్సం
స్వీట్‌కార్న్ పంట ధ్వంసం
● కౌలురైతుకు అపారనష్టం ● సింగాయపల్లిలో ఘటన
వర్గల్(గజ్వేల్): మొక్కజొన్న స్వీట్‌కార్న్ పంటచేలుపై అడవి పందులు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటన సోమవారం రాత్రి వర్గల్ మండలం సింగాయపల్లిలో జరిగింది. బాధిత కౌలురైతు సింగాయపల్లికి చెందిన సొక్కుల శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..తాను కౌలుకు తీసుకున్న మూడెకరాల భూమిలో స్వీట్‌కార్న్ మొక్కజొన్న సాగుచేశాడు. పైరు చక్కగా ఎదిగి కంకులు అందే దశకు చేరింది. అనూహ్యంగా సోమవారం రాత్రి చేనుపై అడవిపందులు దాడి చేశాయి. కంకులను కొరికేసి, కర్రలను విరిచేసి విధ్వంసం సృష్టించాయి. చేనంతా చిందరవందర చేశాయి. రైతుకు భారీ నష్టం కలిగించాయి. అడవిపందుల దాడితో దాదాపు రూ. రెండున్నర లక్షల పంట నష్టం కలిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా దెబ్బతిన్న మొక్కజొన్న పొలాన్ని వ్యవసాయ విస్తరణాధికారి సంతోష్ పరిశీలించారు. పరిహారం కోసం అటవీశాఖకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


