వామ్మో.. పెద్దపులి
సిద్దిపేట జిల్లాలో తిరుగుతోంది..
● నిర్ధారించిన ఫారెస్టు ఉన్నతాధికారులు ● నాలుగేళ్ల వయసున్న మగపులిగా గుర్తింపు ● రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన ● భయాందోళనలో ప్రజలు
దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచారం నాలుగు రోజులుగా కలకలం రేపుతుంది. మంగళవారం ఫారెస్టు ఉన్నతాధికారులు, తడోబా టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు నిపుణుల బృందం తొగుట మండ లం వర్ధరాజుపల్లి శివారు అటవీప్రాంతంలో పర్యటించి పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా పెద్దపులి గా నిర్ధారించారు. సుమారు మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న మగపులి అయిఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు.
వర్ధరాజుపల్లి శివారులో కనబడటంతో..
వర్ధరాజుపల్లి శివారులో పులి కనిపించిదని ఓ రైతు తెలపడం.. ఆ ప్రాంతంలోనే అడవిపందిని చంపితిన్న ఘటన వెలుగుచూడటం.. వ్యవసాయపొలాల్లో పాదముద్రలు ఉండడంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫారెస్ట్ అధికారులు పాదముద్రలు పరిశీలించి ఇవి పెద్దపులిగానే నిర్ధారించుకున్నప్పటికీ కచ్చితంగా వెలువరించలేదు. మొదట చిరుతపులి అయి ఉంటుందని అనుకున్న ఫారెస్టు అధికారులు పాదముద్రలను పరిశీలించాక పెద్దపులిగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. జిల్లాలోని తొగుట మండలం వర్ధరాజుపల్లి, గొవర్ధనగిరి, గుడికందుల, సిద్దిపేట మండలం బుస్సాసూర్, మిరుదొడ్డి మండలం అందె, కొండాపూర్ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా ఆనవాళ్లు ఉన్నట్లు తెలిసింది.
తోడు కోసమే ..
చలికాలం ప్రధానంగా పెద్దపులులకు పునరుత్పత్తి సమయం కావడంతోనే తోడు వెతుక్కుంటూ మగ పులి జిల్లాలో ప్రవేశించినట్లు ఫారెస్టు అధికారులు సూచించారు. పదిరోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో సంచరించిన పెద్దపులి తాజాగా నాలుగు రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోకి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఇది మగ పులి అని ఆడపులి ఇంత దూరం రాదనిఫారెస్టు అధికారులు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్లా జోన్ సీసీఎఫ్ రామలింగం సూచించారు.పెద్దపులి కదలికలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే తడోబా టైగర్ రిజర్వ్ కు చెందిన నిపుణుల బృందం ను తెప్పించి శాసీ్త్రయంగా నిర్ధారించడం జరిగిందన్నారు. రైతులు పొలాల వద్దకు ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లవద్దన్నారు. తమ పశువులను అక్కడ ఉంచవద్దని తెలిపారు. రైతులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ప్రజలు భయందోళన చెందవద్దని అప్రమత్తంగా ఉండాలని కోరారు.


