బురద నీటిలో పడి వ్యక్తి మృతి
దుబ్బాకరూరల్: బురద నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకొంది. ఎస్‌ఐ కీర్తిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జోగు ప్రభాకర్(45) కూలీపని చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో నిమ్మ కిషన్‌రెడ్డికి చెందిన పొలంలో మంగళవారం ఒడ్డు చెక్కేందుకు వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా మూర్చ రావడంతో బురద పడి ఊపిరాడక మృతి చెందాడు. చుట్టు ప్రక్కల వారు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


